Saturday, December 10, 2011

సద్దుకోవటం నేర్చుకుందాం


మన తల్లి తండ్రులను ఎంచుకునే అవకాశం మనకి ఉందా? లేదు కదా. వారు ఎలా ఉన్నా, ఏమి చేసినా మహా అయితే వారి మీద కోపం వస్తుందేమో కాని, వారిని విడిచి వెళ్ళే ఉద్దేశం మనకి రాదు , రాకూడదు. అలా విడిచి వెళ్ళే వాళ్ళ గురించి మనం ఇక్కడ ప్రస్తావిన్చుకోవటం లేదు అనుకోండి. వాళ్ళ గురించి మాట్లాడుకునే అంత గొప్ప వాళ్ళు కాదు వాళ్ళు , నా ఉద్దేశం లో. గొప్ప వాళ్ళు కానఖర్లేదు, కనీసం మామూలు సంస్కారం ఉన్నా వాళ్ళు కుడా కాదు అన్నది నా ఉద్దేశం.

మన  తల్లి తండ్రులను ఎంచుకునే అవకాశం లేనప్పుడు, వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళని మనవాళ్ళు అనుకొని కలిసి ఉన్నప్పుడు, మనతో సహజీవనం చేసే వారి గురించి ఆలోచించటం, ఫలానా లాంటి వాళ్ళు కావలి అని వెతకటం ఎంత వరకు సబబు అని ఆలోచిస్తూ రాస్తున్న వ్యాసం ఇది.

మనకోసం మన తల్లి తండ్రులు వెతికి, నిర్ణయించిన వారు పూర్తిగా వంద శాతం (౧౦౦ %) సరి అయిన వారు అని ఖచ్చితంగా మనకి తెలియదు, వారికి తెలియదు. తల్లి తండ్రులు ఎప్పటికి మంచే చేద్దాం అని అనుకుంటారు, ప్రయత్నిస్తారు కూడా. ఏ తల్లి తండ్రి పిల్లలకి నష్టం కలిగించాలని ఆలోచించరు, కావాలని హాని చెయ్యరు. ఏదో పొరపాటున సరి అయిన నిర్ణయం తెసుకోవటం లో తప్పటిఅడుగు వేసి ఉండచ్చు. మనుషులు అన్నాక పొరపాట్లు చెయ్యకుండానే ఉంటారా ఎవరైనా. ఒకరు చిన్నది అయితే, ఒకరు పెద్దది, తేడా అంటే, అది కూడా వచ్చిన ఫలితాన్ని బట్టి చిన్న తప్పా , పెద్ద తప్పా అన్నది తేలేది. తల్లి తండ్రులకి ఎంత బాధ్యత ఉందో, మనకి ఎదుటి మనిషిని అర్థం చేస్కుకోవటం లో అంతే బాధ్యత ఉండాలి, అది పెళ్ళికి ముందర కావచ్చు, తరవాత కావచ్చు. పెళ్ళికి ముందర ఎదుటి మనిషిని అర్థం చేస్కోవటం లో లోపం ఉంటే, పెళ్లి తరవాత అదే మనిషితో కుదిరినంత వరుకు అలవాటు పడి, సద్దుకు పోవటం అయినా నేర్చుకోవాలి. తల్లి తండ్రులు ఎలా ఉన్నా వాళ్ళని మన వాళ్ళు అనుకొని సద్దుకోగలిగిన వాళ్ళం, పెళ్లి అయ్యాక ఆ మనిషితో ఎందుకు సద్దుకు పోలేకపోతున్నాము?

నిజానికి ఎవరికీ నూరు శాతం మనసులు, ఇష్టాలు, భావాలు కలిసే మనిషి ఎక్కడ దొరకరు. ప్రపంచం లో ఏ ఇద్దరు మనుషులు పూర్తిగా compatible గా ఉండరు. ఎంత కాలం వేచి చూసినా, ప్రపంచం మొత్తం వెతికిన అలా compatible persons దొరకరు. ఏదో ఒక విషయం లో, ఎప్పుడో ఒకప్పుడు ఎదుటి మనిషితో సద్దుకోవాల్సిన అవసరం, పరిస్థితి వస్తుంది. అలా సద్దుకోవాల్సిన పరిస్థితే వస్తే, ఎవరితోనో ఎందుకు, తల్లి తండ్రులు మనకోసం వెతికి, మన కోసం "తిను" అని నిర్ణయించిన మనిషితోనే ఎందుకు సద్దుకోకూడదు? మనల్ని కని పెంచిన తల్లి తండ్రులకన్నా మనగురించి ఇంకా ఎవరికీ బాగా తెలుస్తుంది. నిజానికి మనగురించి మనకన్నా మనల్ని కన్న వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా?. వాళ్ళకి మన ప్రవర్తన, ఏ పరిస్థుతుల్లో ఎలా ప్రవర్తిస్తాము అన్నది కూడా బాగా తెలుస్తుంది. దాని ప్రకారమే మనము ఎలాంటి వాళ్ళతో సరిగ్గా ఉండగలమో అన్నది వాళ్ళకే బాగా తెలుస్తుంది మన కన్నా. అదీ కాకుండా పెద్ద వాళ్ళు అయినందుకు, వాళ్ళకి ఉన్న అనుభవానికి, మనకోసం చూసిన మనిషి మనకి ఎంత వరుకు సరిపడతారు అన్నది వాళ్ళకి బాగా తెలుస్తుంది, సరిఅయిన వాళ్ళని చూస్తారు కుడా. మరి వాళ్ళ నిర్ణయాన్ని మనం ఎందుకు గౌరవించటం లేదు, గౌరవిస్తూ మనకోసం చూసిన మనిషి తో  ఎందుకు
 సద్దుకోలేక పోతున్నాము? సద్దుకోకుండా హద్దులు దాటి విడాకుల దాకా ఎందుకు వెళ్తున్నాము , లేదా మన భాగస్వామిని మనమే ఎందుకు వెతుకుంటున్నాము?

ఫలనా మనిషి మన జీవిత భాగస్వామి అని మనమే ఎంచుకోటానికి కారణాలు ఏమిటి? నమ్మినా నమ్మక పోయిన, ప్రతి మనిషి ఇంట్లో ఉన్నట్టు బయట ఉండరు. అది అక్షరాల నిజం. మనమే మన జీవిత భాగస్వామిని వెతుకున్నప్పుడు మనకి ఆ మనిషి బయట ప్రవర్తిన్చినప్పుడు ఎలా ఉన్నారో అదే తెలుస్తుంది కదా. అంటే అదే మనిషి , అదే పరిస్థితి లో ఇంట్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తారు అన్నది మనకి తెలియదు అన్నమాటే కదా. ఈ మాట మనకి ఎందుకు గుర్తు ఉండదు? ఇలాంటివి గుర్తుపెట్టుకోకుండా మనమే ఎందుకు వెతుకుంటున్నాము?

ఒక మనిషిని  మనం పూర్తిగా అర్థం చేస్కోవాలి అంటే, ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరగాలి, పెరగాలి అంటే ఎక్కువ కాలం పడుతుంది. అలా ఎక్కువ కాలం స్నేహం, సాన్నిహిత్యం గా ఉంటే ఆ మనిషి నిజస్వరూపం ఎంతో కాలం దచలేరు, బయట పడి పోతారు. అలా కాలం గడిచిన కొద్ది ఎదుటి మనిషి లోపాలు కూడా తెలుస్తాయి.అలా కాలం గడిచిన కొద్ది లోపాలు తెలియటం తో పాటు, వాళ్ళ లోపాలని మనం పెద్ద లోపాలుగా భావించము, పైగా వాటిని పెద్దగా పట్టించుకోవటం కూడా తగ్గిస్తాము. అదే కాకుండా మనము మారతాము, ఎదుటి మనిషి మారుతారు. ఇరువురి లోను మార్పులు వస్తాయి, ఇద్దరు ఒకరితో ఒకరు సద్దుకోవటం మొదలు పెడతారు.

ఇలాంటి సద్దుబాట్లు , తల్లి తండ్రులు చేసిన పెళ్లి ల్లల్లో ఎందుకు ఎక్కువ అవ్వడం లేదు??

పూర్వ్యము , పెళ్ళిళ్ళు చిన్న పిల్లల్లుగా ఉన్నప్పుడే చేసేసేవారు. మరి అంత చిన్న వయసులో చేసినందుకు, ఎదుటి వాళ్ళతో సద్దుకునే లక్షణం ఎక్కువ ఉంటుంది. పిల్లలకి నేర్చుకునే లక్షణం చిన్నప్పుడే ఎక్కువ ఉంటుంది కదా. అలాగే ఎదుటి మనిషి ప్రవర్తన తో పాటు సద్దుకుపోవటం కూడా చిన్న తనం లో చాలా సులువుగా వస్తుంది. అప్పటి పెళ్ళిళ్ళు చిరకాలం నిలవటానికి ఇది ఒక కారణం అవ్వచ్చు. 

ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్న ఈ కాలం లో, చిన్నప్పటి ఒక లక్షణం పెద్ద అయ్యాక కూడా కొనసాగించగలుగుతే  ఎన్నో పెళ్ళిళ్ళు పెటాకులవరుకు రాకుండా చేస్కోవచ్చేమో మనము. ఒకసారి అలోచించి చూద్దాం, అలోచించి చేస్తే మరీ బాగుంటుంది.

ఇంట్లో ఒక ఖరీదు అయిన వస్తువు కొనేటప్పుడు మంచిది కొనక పోతే అయ్యో వృధా అవుతుంది అని అలోచించి, మంచిది కొనటానికి ప్రయత్నిస్తాము. సరి అయిన వస్తువు రాక పోయినా అంత డబ్బులు పెట్టాం కదా అని సద్దుకుంటాం, అలాంటిది జీవితాంతం కలిసి ఉండాల్సిన ఒక మనిషితో మాత్రం సద్దుకోలేక పోతున్నాం. అలా కాకుండా ఇంట్లో ఏదో ఒక సామాను కొని నచ్చక పొతే తిరిగి ఇచ్చేసినట్టు, మనం మన జీవిత భాగస్వామిని ఎందుకు మార్చుకుంటున్నాము? ఇంట్లో సామాను తో సమానంగా మన జీవిత భాగస్వామిని ఎందుకు treat చేస్తున్నాము? అలా treat చేసి పెళ్ళిళ్ళు విడాకులవరుకు ఎందుకు తెచ్చుకుంటూన్నాము? ఎందుకు సద్దుకోలేక పోతున్నాము? సద్దుకోవటం ఎందుకు నేర్చుకోలేక పోతున్నాము? ఒక్క సారి అలోచించి చూద్దాం!!!